తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బిహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించినా.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఆయన ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. ఆ వెంటనే ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజుల కిందటే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. వాస్తవానికి సోమేశ్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్ వరకూ సర్వీస్‌లో కొనసాగే అవకాశముంది.