ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కొత్త సారథిగా భారత సంతతి అమెరికన్ నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయ న యూట్యూబ్‌లోనే చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీఈఓ సుసాన్ వోజ్కికీ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు. సుసాన్ గడిచిన 9 ఏళ్లుగా యూట్యూబ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇకపై కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత అభిరుచులపై దృష్టిసారించేందుకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ఆమె తెలిపారు. సుసాన్, మోహన్ గూగుల్‌లో చాలాకాలంగా కలిసి పనిచేస్తున్నారు. ఆమె కు అత్యంత నమ్మకైన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. యూట్యూబ్ కూడా ఆల్ఫాబెట్ గ్రూప్ సంస్థే. గూగుల్‌తోపాటు ఆల్ఫాబెట్‌కు భారత వ్యక్తి సుందర్ పిచాయ్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌నకు ఆదాయపరంగా చాలా కీలకమైన యూట్యూబ్ పగ్గాలు కూడా భారత సంతతి వ్యక్తికే లభించడం విశేషం.