నీటి శుద్ది ప్రక్రియలో వినియోగించే గ్యాస్ సిలిండర్ నుంచి క్లోరిన్ వాయువు లీకైన ఘటన జనగామ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వాయువు పీల్చిన సుమారు 100 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైలు పక్కనే ఉన్న మునిసిపల్ నీటి ట్యాంకు వద్ద కొన్నేళ్లుగా వృథాగా ఉంటున్న క్లోరిన్ గ్యాస్ సిలిండర్ లీకైంది. గురువారం సాయంత్రం ప్రారంభమైన లీకేజీ.. రాత్రి 7 తర్వాత ఉధృతమైంది. విషయం తెలుసుకున్న నీటి సరఫరా సిబ్బంది.. సూపర్వైజర్కు సమాచారం ఇచ్చారు. సూపర్ వైజర్ సూచన మేరకు సిలిండర్ను పక్కనే ఉన్న నీటిసంపులో వేయగా.. క్లోరిన్ వాయువు లీకేజీ పాక్షికంగా ఆగిపోయింది. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. కొద్దికొద్దిగా లీక్ అవుతున్న క్లోరిన్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు సంపులోకి మంచినీటిని అధికంగా వదిలారు. దీంతో సమస్య తగ్గకపోగా మరింత తీవ్రమైంది. ఈ నీరు క్లోరినేషన్తో పాటు పోటాష్ ఆలం మిశ్రమం కలిపింది కావడంతో నీరంతా బయటకు ఉప్పొంగింది. ఈ క్రమంలో నీరు బయటకు ప్రవహించినంత దూరం ఘాటైన వాసన వ్యాపించింది. సమీపంలోని ఈద్గా వెనుక కాలనీలు, ఆర్అండ్బీ అతిథి గృహం రహదారి మీదుగా వెళ్లేవారు, గీతానగర్ పరిసరాలపై దీని ప్రభావం పడింది. లీకవుతున్న గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.