అత్యాధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను తీసుకురానుంది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు హైటెక్ మోడల్లో ఈ బస్సులను రూపొందించింది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా నామకరణం చేసింది. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో నూతన నమూనా ఏసీ స్లీపర్ బస్సును ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొస్తున్న ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.