రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ భద్రత మధ్య అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ ఆకస్మిక పర్యటన సాగింది. ఐదు గంటల పాటు అక్కడ పర్యటించిన జో బైడెన్.. ఉక్రెయిన్‌లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ చాలా బలహీనంగా ఉందని.. పశ్చిమ దేశాలు ఐకమత్యంగా లేవని భావించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొన్నారు. ‘దాదాపు ఏడాది కిందట పుతిన్ తన దండయాత్రను ప్రారంభించినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనంగా ఉందని, పశ్చిమ దేశాలు కలిసికట్టుగా లేవని భావించారు. మమ్మల్ని అధిగమించవచ్చని అనుకున్నారు.. కానీ, ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి.. ఉక్రెయిన్ ప్రజలు సామాన్యులు.. కష్టపడేతత్వం ఉన్నవారు. సైన్యంలో ఎప్పుడూ శిక్షణ పొందలేదు.. కానీ, యుద్ధంలో వారు ముందుకు సాగిన విధానం వీరోచితమైంది’ అని జో బైడెన్ కొనియాడారు. కీవ్ నా హృదయంలో కొంత భాగాన్ని ఆక్రమించిందని అన్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు అండగా నిలిచామని.. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతోందని స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్‌లో జో బైడెన్ పర్యటనను ఎవరూ ఊహించలేదు. ఈ విషయంలో ఉక్రెయిన్ సైతం గుంభనంగా వ్యవహరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొదట అమెరికా నుంచి విమానంలో పోలాండ్‌కు చేరుకున్న బైడెన్.. అక్కడి సరిహద్దు నుంచి రాత్రివేళ రైలు మార్గంలో కీవ్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.