ప్రీతి మృతికి మానసిక వేధింపులే కారణమని యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించినట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ తెలిపారు. బుధవారం కేఎంసీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ అధ్యక్షతన 13 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశం మూడు గంటలపాటు కొనసాగింది. అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. సెల్‌ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన సంభాషణను పరిశీలించిన కమిటీ సైఫ్ పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టింగులు కీలకంగా మారాయని తెలిపారు. వేధింపులపై బాధితురాలి తండ్రి ద్వారా అందిన సమాచా రం మేరకు అనస్థీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి జరిపిన విచారణలో ప్రీతి తనను సైఫ్ వేధిస్తున్నట్టు, విధి నిర్వహణలో తనకు సీనియర్లు ఎవరూ సహకరించవద్దంటూ పోస్టింగులు పెట్టినట్టు రోదిస్తూ చెప్పిన విషయాన్ని విభాగాధిపతి వెల్లడించినట్టు తెలిపారు. మానసిక వేధింపులే ప్రీతి మరణానికి కారణమని విచారణలో కమిటీ నిర్ధారించినట్టు స్పష్టంచేశారు. ఈమేరకు కమిటీ నివేదికను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు, నేషనల్ మెడికల్ కమిషన్‌కు సమర్పించనున్నట్టు వెల్లడించారు.