ఓ చిన్నారి ఆడుకుంటూ తల్లి స్నానానికి వెళ్లిన రూమ్‌కు బయట గడియ పెట్టాడు. బాత్రూమ్లో ఉన్న తల్లికి బయట ఏం జరిగిందో తెలియక గుండె ఆగినంత పని అయ్యింది. రెండు మూడు గంటల ఉత్కంఠకు ఫైర్ సిబ్బంది రాకతో తెరపడింది. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి ప్రకాశ్‌నగర్ సాయిరాఘవ టవర్స్ మూడో ఫ్లోర్లో సంతోషలక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఆమెకు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం చిన్నారికి బాత్రూమ్లో స్నానం చేయించి రూమ్ బయట వదిలింది. ఆ తర్వాత తల్లి కూడా స్నానం చేస్తోంది. ఇంతలో ఆ బాలుడు బాత్రూమ్ డోర్ దగ్గర ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. చిన్నారి ఆడుకుంటూ బాల్కనీలోకి వెళ్లాడు.. అక్కడ గ్రిల్లో కాలు పెట్టడంతో ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోకపోవడంతో పెద్దగా ఏడ్చాడు. బాబు ఏడుపు బాత్రూమ్ నుంచి విన్న తల్లి బయటకు వద్దామని చూస్తే.. గడియ పెట్టడంతో రాలేకపోయింది. కుమారుడికి ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. ఆమె పెద్దగా గట్టిగా కేకలు వేయడంతో పొరుగున ఉండేవాళ్లు వచ్చారు.. వాళ్లు బయట నుంచి లోపలికి వెళ్దామంటే మెయిన్ డోర్ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వెంటనే అక్కడికి చేరుకుని.. నిచ్చెన ద్వారా పైకి ఎక్కి బాల్కనీలోని గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడిని కాపాడారు. తర్వాత లోనికి వెళ్లి బాత్రూమ్ గడియ తీయడంతో తల్లి సంతోషలక్ష్మి బయటకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. బుడతడు చేసిన పనితో రెండు గంటల పాటూ అందరూ టెన్షన్ పడ్డారు.