వచ్చేవారం షేర్‌ మార్కెట్‌ అంచనా

ఈవారం చాలా అనకూల పరిణామాలతో షేర్‌ మార్కెట్లు ముగిశాయి. వడ్డీ రేట్లు తగ్గించకున్నా.. అమెరికా ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చెప్పడంతో సెంటిమెంట్‌ బలపడింది. మరోవైపు ఒపెక్‌ తీసుకున్న నిర్ణయంతో ముడి చమురు ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా ముడి చమురు ధర బ్యారెల్‌ ధర 60 డాలర్లను దాటింది. ఇక బ్రిటన్‌లో అనిశ్చితికి చరమ గీతం పలికారు అక్కడి ఓటర్లు. అన్నింటికన్నా ముఖ్యమైంది అమెరికా,చైనాల మధ్య తొలి విడత ఒప్పందం కుదరడం. దీంతో షేర్ మార్కెట్లు చాలా పాజిటివ్‌గా ముగిశాయి.

పడితే కొనడం…

స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు వచ్చే మార్కెట్‌ ట్రెండ్‌పై చాలా ఆశాజనకంగా ఉన్నారు. అన్ని సూచీలు అప్‌ట్రెండ్‌నే సూచిస్తున్నాయని అంటున్నారు. నిఫ్టి 50 వచ్చేవారం 12100 టార్గెట్‌గా ముందుకు సాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. గడచిన మూడు, నాలుగు వారాల్లో సూచీలో డబుల్‌ బాటమ్‌ ఏర్పడిందని, మధ్య కాలానికి బుల్లిష్‌ ధోరణి కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణ అని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్‌ మోడీ అభిప్రాయపడుతున్నారు. 11,800 వద్ద మద్దతు తీసుకుని పెరుగుతున్న వైనం… సూచీ బలాన్నీ చూపిస్తోంది. వీక్లీ చార్ట్‌లు కూడా బుల్లిష్‌నెస్‌ను చూపిస్తున్నాయి. 12,150 టార్గెట్‌ ఉంచుకుని లాభాలు స్వీకరించవచ్చని జిమీత్‌ మోడీ అంటున్నారు. వారపు కనిష్ఠ స్థాయిని స్టాప్‌ లాస్‌గా పెట్టుకుని… మార్కెట్‌ పడినపుడల్లా కొనుగోలు చేయడం శ్రేయస్కరమని ఆయన అంటున్నారు.

Related Articles