తమిళనాట మరో ఉదయించే సూర్యుడితో మరో రాజకీయ వారసుడు ఉదయిస్తున్నాడు. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి మనవడు, ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇపుడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ నగరంలోని రెండు కీలక స్థానాల నుంచి పోటీ చేయడం విశేషం. ఉదయనిధి నగరం నడిబొడ్డున ఉండే చెపాక్ నుంచి పోటీ చేస్తుండగా, తండ్రి స్టాలిన్ నగర శివార్లలోని కొలత్తూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 234 స్థానాలకు గాను 173 స్థానాల్లో డీఎంకే తన అభ్యర్థులను ఇవాళ ప్రకటించింది. మరో 14 సీట్లు చిన్న పార్టీలకు ఇచ్చినా.. ఆ పార్టీలు కూడా ఉదయించే సూర్యుడు అంటే డీఎంకే గుర్తుపై పోటీ చేస్తాయి.
బందినాయకనూర్ నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి ఓ పన్నీర్ సెల్వంపై తంగ తమిళ్‌సెల్వన్ పోటీ చేస్తారు. జల్లికట్టు ఫేమ్ కార్తికేయ శివసేనాపతిని కోయంబత్తూరు నుంచి బరిలోకి దింపుతోంది డీఎంకే. అన్నాడీఎంకే మంత్రి ఎస్‌పీ వేలుమణిపై కార్తికేయ పోటీ చేస్తారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అభ్యర్థి పళనిస్వామి ఎడిప్పాడి నుంచి పోటీ చేస్తుండగా, ఆయనపై సంపత్ కుమార్‌ను దింపింది డీఎంకే.