అరెస్ట్ సమయంలో తనను అప్రతిష్ఠ పాలు చేయడంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికీ నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు లీగల్ నోటీసులు ఇస్తున్నారు. తాజాగా టీవీ9 యాజమాన్యంతో పాటు యాంకర్లకు నోటీసు జారీ చేశారు. టీవీ9 యజమాని జె జగపతి రావు, ఛానల్ సీఈఓ బరుణ్ దాస్, మేనేజింగ్ డైరెక్టర్, యాంకర్ రజనీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యాంకర్ మురళీ కృష్ణకు రాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్టర్లు కావాలని తప్పుడు సమాచారం ఇచ్చి.. తన ప్రతిష్ఠకు భంగం కల్గించారని, అలాగే చర్చల సమయంలో రజనీకాంత్, మురళీకృష్ణ దురుద్దేశంతో, పక్షపాతంతో తన పరువుకు నష్టం కల్గించేలా వ్యాఖ్యానించారని నోటీసులో రాజు ఆరోపించారు.
సీబీఐ విషయంలో కేంద్ర,రాష్ట్రాలు… అన్న అంశంపై రజనీకాంత్ ఓ చర్చా కార్యక్రమం నిర్వహించి.. అందులో తన అరెస్ట్‌పై సీబీఐ మాజీ జేడీ వి లక్ష్మీనారాయణ మాట్లాడేలా రజనీకాంత్ ఉద్దేశపూర్వకంగా ప్రశ్నలు వేశారని రాజు ఆరోపించారు. ఆది,శనివారాల్లో కూడా కోర్టు పనిచేసేలా పార్లమెంటు సభ్యునికి ప్రత్యేక హక్కులు ఉంటాయా? అంటూ ప్యానలిస్టులకు ప్రశ్నలు వేశారని అన్నారు. ముఖ్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో ముందు నిర్ణయించుకున్న ఒప్పందం మేరకు 28 నిమిషాల 30 సెకన్ల షో నిర్వహించారని రాజు తన పిటీషన్‌లో ఆరోపించారు. ఆ షోలో తన మీద సుధాకర్ రెడ్డి ఇష్టానుసారం ఆరోపణలు చేసే అవకాశం యాంకర్ రజనీకాంత్ కల్పించారని…ఆ షో తన మీద ‘మీడియా విచారణ’ జరిపినట్లు ఉందని రఘు రామకృష్ణ రాజు ఆరోపించారు.తనపై తప్పడు ఆరోపణలు చేసినందుకు ఏడు రోజుల్లోగా టీవీ 9 న్యూస్ ఛానల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని రాజు స్పష్టం చేశారు.