మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం

‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటినీ అతి దగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన తనకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉందని నటుడు మంచు విష్ణు అన్నారు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామంటూ ఆయన ఇవాళ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈసారి ఎన్నికల్లో మా అధ్యక్షస్థానానికి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు తామెంతో ఋణపడి ఉన్నామని… ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని మంచు విష్ణు అన్నారు.

మంచు విష్ణు పత్రికా ప్రకటన.

నమస్కారం …
‘ మా ‘అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు , బాధలూ బాగా తెలుసు .. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో ఋణపడి ఉన్నాము. ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మా నాన్నగారు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను పనిచేసినప్పుడు ‘మా’ బిల్డింగ్ ఫండ్‌కి నా కుటుంబం తరుపున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25% అందిస్తానని మాట ఇచ్చాను. బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేసాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను. ‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటినీ అతి దగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. ‘ మా ‘ సభ్యులలో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా వుంటాము, అందుబాటులో ఉంటాము. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తూ … మీ ఆశీస్సులు కోరే
.. విష్ణు మంచు

Related Articles