హడలెత్తించారు

నాటింగ్‌హామ్‌ టెస్టు తొలిరోజు టీమిండియా అద్భుత ఆటతీరు కనబర్చింది. పేసర్లు నిప్పులు చెరిగే బంతులకు ప్రత్యర్ధి బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలైంది. జస్ర్పీత్‌ బుమ్రా (4/46), మహ్మద్‌ షమి (3/28), శార్దూల్‌ ఠాకూర్‌ (2/41), మహ్మద్‌ సిరాజ్‌ (1/48) విజృంభణతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ జో రూట్‌ (64) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (0) డకౌటయ్యాడు. డామ్‌ సిబ్లే (18), జాక్‌ క్రాలే (27), బెయిర్‌స్టో (29) కూడా నిరాశపర్చారు. మిడిలార్డర్‌లో డాన్‌ లారెన్స్‌ (0), జోస్‌ బట్లర్‌ (0) ఖాతా తెరవలేదు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ తొలిరోజు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 21 రన్స్‌ చేసింది. రోహిత్‌ (9 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ రాయ్‌ బర్న్స్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ క్రాలే క్యాచ్‌ అవుటయ్యాడు. ఇక్కడి నుంచి కోహ్లీసేన క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్‌ చేరుతున్నా రూట్‌ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్ల దెబ్బకు ఓ దశలో ఇంగ్లండ్‌ 138/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖర్లో సామ్‌ కర్రాన్‌ పోరాటంతో ఆతిథ్య జట్టు 180 స్కోరును దాటగలిగింది.

Related Articles