టోక్యోఒలింపిక్స్: హాకీ ఇండియా చారిత్రక విజయం

ఒలింపిక్స్ లో 41 ఏళ్ల నిరీక్షణకుతెర.. సెమీస్ మెరిసిన హాకీ ఇండియా.. కాంస్యం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది . జర్మనీని 5-4 గోల్ తేడాతో ఓడించి కాంస్యం పట్టేసింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది. మ్యాచ్ ఆరంభంలో తడబడిన భారత్ ఆ తర్వాత పుంజుకుని వరుస గోల్స్‌తో ప్రత్యర్థిని రఫ్పాడించింది. చివరకు చారిత్రాత్మక విజయంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మొదటి క్వార్టర్‌లో ప్రత్యర్థి జర్మనీ 0-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, రెండో క్వార్టర్‌లో భారత జట్టు అదరగొట్టింది. సీమ్రన్‌జీత్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన జర్మనీ వరుసగా రెండు గోల్స్ చేసి 1-3 తేడాతో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది.

భారత్ తరఫున హర్దీక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండు గోల్స్ చేశారు. దీంతో రెండో క్వార్టర్ ముగిసేసరికి భారత్ 3-3తో మ్యాచ్‌ను సమం చేసింది. ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో భారత జట్టుకు ఎదురులేకుండా పోయింది. జర్మనీ డిఫెండ్‌ను చేదించి వరుస పెనాల్టీ కార్నర్లు సాధించడంతో పాటు వాటిని గోల్స్‌గా మలిచింది. రూపిందర్ సింగ్, సీమ్రన్‌జీత్ రెండు గోల్స్ అందించారు. దీంతో టీమిండియా మూడో క్వార్టర్ ముగిసే సమయానికి 5-3తేడాతో పూర్తి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయితే, నాలుగో క్వార్టర్‌లో జర్మనీ ఓ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. ఇక చివరి వరకు మరో గోల్ చేసేందుకు ప్రత్యర్థి తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శనతో జర్మనీకి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా గోడల నిలబడ్డాడు. చివరకు భారత్ 5-4 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.

Related Articles