దొంగబాబాపై నెల్లూరులో 13 కేసులు

భూతవైద్యం పేరిట అమాయక యువతులకు వల వేస్తున్న దొంగబాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు పెళ్లిళ్లు చేసుకొని.. ఎనిమిదో పెళ్లికి సిద్ధమై, దొరికిపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన బాబా హఫీజ్‌ పాషాపై ఇప్పటికే 13 కేసులు ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ టోలీచౌకి ప్రాంతానికి చెందిన యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దశాబ్ద కాలంగా యువతులకు మాయ మాటలు చెప్పడం.. వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించడం.. కొందరిని పెళ్లి చేసుకోవడం.. మరికొందరిని మోసగించడంలో హఫీజ్‌ పాషా ఆరితేరాడని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రహ్మతుల్లా దర్గాలో బాబాగా అవతారమెత్తిన హఫీజ్‌ పాషా 2012 నుంచే నేరాల బాట పట్టాడు. అప్పట్లోనే దర్గాకు వచ్చిన తమిళనాడుకు చెందిన ఓ యువతికి గాలం వేయడానికి ప్రయత్నించగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో అక్కసు పెంచుకున్న బాబా ఆ యువతి ఇంట్లో గంజాయి ప్యాకెట్లు విసిరేసి తప్పుడు కేసు బనాయించడానికి ప్రయత్నించాడు. అది బెడిసి కొట్టడంతో అతనిపై మరో కేసు నమోదైంది. ఆ తర్వాత అతనిపై మరో ఇద్దరు యువతులు నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు అతనిపై నెల్లూరులో 13 కేసులు నమోదయ్యాయి. తాజాగా లంగర్‌హౌజ్‌ పీఎ్‌సలో మరో కేసు నమోదైంది. కాగా, మూడేళ్ల నుంచి చికిత్స పేరిట రహ్మతాబాద్‌కు వెళ్లి వస్తున్నట్లు టోలీచౌకీకి చెందిన బాధిత యువతి చెబుతున్నారు. అప్పటి నుంచే తనను పెళ్లి చేసుకోవాలని బాబా ఒత్తిడి తీసుకొస్తున్నాడని.. అంగీకరించకపోవడంతో తన తల్లిదండ్రులకూ సమస్యలు వస్తాయని బెదిరించినట్లు వాపోయారు. అందుకే అతనితో పెళ్లికి సిద్ధమైనట్లు చెప్పారు. చివరి క్షణంలో అతను రాకపోవడంతో ఆరా తీయగా.. యువతులను వేధిస్తుంటాడన్న విషయం తెలిసిందని వివరించారు. తన లాగా ఇతర యువతులు మోసపోకూడదని.. బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. పోలీసులు సరైన రీతిలో విచారిస్తే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles