రామ్‌చరణ్‌పై కెమెరూన్ పొగడ్తలు, చిరు ఎమోషనల్ ట్వీట్‌

ఆర్‌ఆర్ఆర్‌ నుంచి ఓరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటు నాటు ఆస్కార్‌ బరిలో నిలిచింది. ఒక తెలుగు పాట ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా మనం గర్వించాల్సిన విషయం. ఇక ఈ సినిమా గురించి ఎంతో మంది హాలీవుడ్‌ దర్శకులు, టెక్నీషియన్లు గొప్పగా చెప్పారు. తాజాగా మరోసారి హాలీవుడ్‌ దర్శక దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్కార్‌ పురస్కారాలు దగ్గర పడిన నేపథ్యంలో జేమ్స్‌ అవతార్‌-2 కోసం హాలీవుడ్‌లో జోరుగా ప్రమోషన్‌లు చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో జేమ్స్‌ కామెరూన్‌ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి గుర్తు చేసుకున్నాడు. దర్శకుడు రాజమౌళి విజన్‌ గురించి, చరణ్‌ పాత్ర గురించి గొప్పగా మాట్లాడాడు. చరణ్‌ పాత్ర తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. అయితే ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి టైమ్‌ పడుతుందని, కానీ ఒక్కసారి అర్థమయ్యాక మనసు బరువెక్కుతుందని చెప్పాడు. చరణ్‌ పాత్రను రాజమౌళి గొప్పగా మలిచారని, ఇదే విషయాన్ని తనతో స్యయంగా చెప్పానని పేర్కొన్నారు. ఇక దీనిపై చిరు తాజాగా స్పందించాడు. తన సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ మీ లాంటి గ్లోబల్‌ ఐకాన్, సినిమాటిక్‌ జీనియస్‌ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆస్కార్‌ అవార్డు కంటే తక్కువేం కాదని చిరు వెల్లడించాడు. ఇది రామ్‌చరణ్‌కు గొప్ప గౌరవమని, చరణ్‌ సినీ ప్రయాణంపై తండ్రిగా నేను గర్వపడుతున్నానని ఉప్పొంగిపోయాడు. మీ అభినందన చరణ్‌ భవిష్యత్‌కు ఆశీర్వాదం అని ట్వీట్‌ చేశాడు. ఒక ఇండియన్‌ సినిమా గురించి ఇంత గొప్పగా హాలీవుడ్‌ టెక్నీషియన్లు మాట్లాడటం ఆర్‌ఆర్‌ఆర్‌కే చెల్లింది. జక్కన్న విజన్.. చరణ్‌, తారక్‌ల నటనకు దిగ్గజ హాలీవుడ్‌ దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇటీవలే నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లింది. ఇప్పటికీ జపాన్‌, చైనా వంటి దేశాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్‌లతో దూసుకుపోతుంది.

Related Articles