దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు. 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఏండ్ల ప్రాయంలోనే తెరంగేట్రం చేసిన ఆయన 2001లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా కేరీర్ ప్రారంభించారు. ఇప్పటివరకు 23 సినిమాలు, పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన ఆయన పలు చిత్రాల్లో ప్రతి కథనాయుకుడి పాత్రల్లోనూ మెప్పించారు. 2006 నుంచి మూడేండ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆయన.. ఒకేరోజు 9 చిత్రాలకు ముహూర్తం చేసి రికార్డు సృష్టించారు.