కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీ సాయన్న ఆరోగ్య సమస్యలతో ఆదివారం కన్నుమూశారు. ఈ నెల 16న అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబీ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పాటు కార్డియాక్‌ అరెస్టుతో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. సాయన్నకు గతంలో బైపాస్‌ సర్జరీ కూడా చేశారు. మధుమేహం కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఎడమ కాలును కొన్నేళ్ల క్రితం తొలగించారు. ఆయనకు డయాలసిస్‌ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా వెన్నులో నొప్పి రావడంతో పాటు శరీరమంతా చమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల అనంతరం ఆయన కోలుకున్నారని, ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలిస్తారని భావిస్తున్న తరుణంలో ఆదివారం ఉద యం ఒక్కసారిగా స్ట్రోక్‌ వచ్చి తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. సాయన్నకు భార్య గీత, ముగ్గురు కుమార్తెలు నమ్రత, లాస్య నందిత, నివేదిత ఉన్నారు. వీరిలో లాస్య నందిత గతంలో జీహెచ్‌ఎంసీ కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 1951 మార్చి 5న జన్మించిన సాయన్న.. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సిండికేట్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీలో చేరారు.

Related Articles