హైదరాబాద్ అంబర్‌పేటలో.. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. కుక్కల్ని పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను జారీ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన మున్సిపల్ శాఖ అధికారులు మెుత్తం 13 పాయింట్లతో మార్గదర్శకాలను విడుదల చేశారు.
* కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయటం.
* కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు 040 21111111
* మాంసం దుకాణాలు, హోటల్స్ నిర్వాహకులు రోడ్లపై వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవటం.
* కుక్కల స్థితిపై జీహెచ్ఎంసీ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలి.
* జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.
* పాఠశాలల్లో విద్యార్థులకు వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలనే అనే అంశాలను వివరించాలి.
* కాలనీ సంఘాలు, బస్తీలలో వచ్చే నెల రోజులు కుక్క కాటుపై అవగాహన కల్పించాలి.
* కాలనీలే కాకుండా, మూసి పరిసర ప్రాంతాల్లో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనిని కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయటం.
* వీధి కుక్కల దత్తత తీసుకోవటంపై ప్రజలకు అవగాహన పెంచడం.
* కుక్క కాటుకు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించడం.
* వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్, పోస్టర్స్, బిల్ బోర్డ్స్‌తో ప్రచారం.
* వీధి కుక్కల కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు ఏర్పాటు చేయటం.