కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యిందని, దేశంలో ఫ్రంట్ కానీ టెంట్ కానీ లేవని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేసి బలమైన కూటమి తయారు చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, అదే ప్రత్యామ్నాయ ఫ్రంట్ అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కీలక భాగస్వామి అవుతుందని, రాష్ట్ర ప్రజల కోసం తాము పని చేస్తామని కవిత ప్రకటించారు. శనివారం ముంబైలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఒకే ఫ్రంట్, బీజేపీ ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యిందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తోందని తెలిపారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.