సునీల్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడు (ఏ-2) సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌ ఇస్తే సాక్షుల భద్రత, పారదర్శక దర్యాప్తు ప్రమాదంలో పడతాయని.. అందుకే ఇవ్వడం లేదని తేల్చిచెప్పింది.. పిటిషన్‌ను కొట్టేస్తూ తుది తీర్పు జారీచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ సుమలత సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వివేకా హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదంటూ సునీల్‌ యాదవ్‌ ఈ నెల 6న తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన బెయిల్‌ ఇవ్వరాదని పేర్కొంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్‌ అయ్యారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీ నాగేంద్రన్‌ వాదనలు వినిపించారు. తాను అమాయకుడినని.. హత్యతో సంబంధం లేదని సునీల్‌ అంటున్నారని.. ఏ సంబంధమూ లేని వ్యక్తి గోవాకు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. గూగుల్‌ టేకౌట్‌ ద్వారా వివరాలు సేకరించి గోవాలో అరెస్టు చేశామన్నారు. నిందితుడు సీబీఐకి ఏమాత్రం సహకరించలేదని తెలిపారు. ‘హత్యకు ముందు వివేకా నోటిపై మొట్టమొదట సునీల్‌ యాదవే కొట్టారు. తర్వాతే గొడ్డలు వేటు పడింది. వివేకా డ్రైవర్‌ ప్రసాద్‌ మీద నెట్టేందుకు లేఖ రాయించారు. ప్రసాదే చంపాడని కేసును ట్విస్ట్‌ చేయాలని చూశారు. సునీల్‌ పాత్రపై ఇంత స్పష్టమైన ఆధారాలున్నాయి. అందుచేత బెయిలివ్వొద్దు’ అని కోరారు.

Related Articles