11 ఏళ్లుగా గదిలో భార్య నిర్భంధం

విజయనగరంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త.. 11 ఏళ్లుగా గదిలో నిర్భంధించాడు. చివరికి పోలీసుల చొరవతో ఆమెకు విముక్తి లభించింది. విజయనగరంలోని కంటోన్మెంట్‌‌ ఏరియాలో మధుబాబు నివాసం ఉంటున్నారు.. ఆయన లాయర్. మధుకు 2008లో పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జనార్దన్‌, హేమలత దంపతుల కుమార్తె సాయిసుప్రియతో వివాహం జరిగింది. 2009లో సుప్రియ ప్రసవానికి పుట్టింటికి వెళ్లారు.. కుమార్తె పుట్టిన తర్వాత అత్తారింటికి తిరిగి వచ్చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా.. కనీసం ఫోన్లో మాట్లాడనీయకుండా ఆమెను అడ్డుకున్నారు. సుప్రియకు ఆ తర్వాత ఇద్దరు బాబులు పుట్టిన విషయాన్నీ పుట్టింటివారికి తెలియనివ్వలేదు. ఆమెను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చినా భర్త మధుబాబు రానివ్వకుండా అడ్డుకున్నారు. కూతురు గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. ఏళ్లు గడుస్తున్నా కుమార్తె ఎలా ఉందో తెలియక సుప్రియ తండ్రి జనార్దన్‌ మంచం పట్టారు. గత నెల 27న సుప్రియ తల్లి హేమలత ధైర్యం చేసి స్పందనలో ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ కూతుర్ని ఓ గదిలో బంధించారని.. ఆమెను కాపాడాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో మధుబాబు ఇంటికి వన్ టౌన్ పోలీసులు వెళ్లి ఆరా తీశారు. అప్పుడు కూడా మధుబాబు.. తమ ఇంటికి రావడానికి ఆదేశాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించడంతో.. పోలీసులు అక్కడి నుంచి వెనక్కు వచ్చేశారు. ఆ వెంటనే కోర్టును ఆశ్రయించారు. సుప్రియ నిర్బంధం గురించి ప్రస్తావించారు. చివరికి న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు బుధవారం మధ్యాహ్నం సెర్చ్‌ వారెంట్‌తో వీఆర్వో, స్థానికులు మధు ఇంటికి వెళ్లారు. తలుపు తీయాలని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వినకపోవడంతో బలవంతంగా లోపలికి వెళ్లారు. సుప్రియను తమ వెంట పంపించాలని పోలీసులు, అధికారులు కోరినా అంగీకరించలేదు. దీంతో ఆమెను బలవంతంగా తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సుప్రియను ప్రస్తుతానికి తల్లిదండ్రులకు అప్పగించాలని జడ్జి ఆదేశించారు. గురువారం రెండు కుటుంబాలను న్యాయ సేవాధికార సంస్థ ముందు హాజరుపరచాలని సూచించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత సుప్రియం గది నుంచి బయటకు వచ్చారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆమెకు విముక్తి లభించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Related Articles