గవర్నర్‌పై సుప్రీంలో దావా

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్‌ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఆమోదం తెలపకుండా బిల్లులను వాయిదా వేస్తే హక్కు, ఆలస్యం చేసే హక్కు గవర్నర్‌కు లేదని వివరించింది. గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, రాజ్యాంగంలోని అధికరణ 163 కింద ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే విధులను నిర్వహించాలని, శంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పునః పరిశీలించాలంటూ బిల్లును గవర్నర్‌ తిప్పి పంపవచ్చని, కానీ, సవరణ చేసి కానీ చేయకుండా కానీ దానిని తిరిగి అసెంబ్లీ ఆమోదిస్తే ఆ బిల్లును తొక్కిపట్టే అధికారం గవర్నర్‌కు లేదని అధికరణ 200 స్పష్టం చేస్తోందని వివరించింది. ఈ విషయంలో టీటీ కృష్ణమాచారి చేసిన వాదనలను ఉటంకించింది. బిల్లులను ఆమోదించడం రాజ్యాంగబద్ధ విధి అని; రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా తొక్కిపెట్టడాన్ని అసాధారణం, అక్రమం, రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రకటించాలని సుప్రీం కోర్టును కోరింది. అలాగే, పెండింగులో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తన పిటిషన్‌తోపాటు మొత్తం పది బిల్లుల గెజిట్‌లనూ జత చేసింది.

Related Articles