రాష్ట్రంలో అత్యున్నతమైన రాజ్‌భవన్‌ను కూడా కొందరు అవమానిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గవర్నర్ హోదాలో ఉన్న తనను తీవ్ర పదజాలంతో దూషించిన వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలతో తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సందేశం ఇస్తోందని ఆమె ప్రశ్నించారు. తనను ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోనని, అవసరమైన వారికి ఒక సోదరిలా తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై ‘అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో ఉన్న మహిళా అధికారులకు ఆహ్వానాలు పంపామని.. వేడుకలకు అందరూ హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. కానీ, రాష్ట్రంలో ఆ విధానాన్ని మరిచి వ్యవహరిస్తున్నారని గవర్నర్ చెప్పారు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న మహిళను అవమానిస్తున్నారని తమిళిసై ఆరోపించారు. తనకు అవమానం జరిగినప్పుడు మహిళలంతా తన వెంట ఉన్నారని.. అందుకే తాను ధైర్యంగా నిలబడగలిగానని చెప్పారు. తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని తమిళిసై అన్నారు. ఉన్నత చదువులు చదివిన ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. తాను తెలంగాణలోనే పుట్టానని నటి పూనమ్ కౌర్ అన్నారు. కానీ, కొందరు తెలంగాణ నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగానని చెప్పారు.