రాజధాని కేసులో 28నే విచారణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విషయంలో జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై త్వరగా విచారణ పూర్తి చేయాలన్న రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. గతంలో చెప్పినట్లుగాఈ నెల 28వ తేదీనే విచారిస్తామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు చాలా పెద్దదని.. రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని జస్టిస్‌ జోసెఫ్‌ తెలిపారు. దీనిపై విచారణ చేపడితే.. ఒక సార్థకత అంటూ ఉండాలని వ్యాఖ్యానించారు. 28న విచారణంటే ఆలస్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి మళ్లీ పేర్కొన్నారు. అయితే 28వ తేదీనే విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేయడంతో.. అందుకు ఆ ఒక్క రోజే సరిపోదని, 29, 30 తేదీల్లో (బుధ, గురువారాలు) కూడా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. నోటీసులు ఇచ్చిన కేసుల్లో బుధ, గురువారాల్లో విచారణ జరుపరాదని ప్రధాన న్యాయమూర్తి సర్క్యులర్‌ ఇచ్చారని ధర్మాసనం గుర్తు చేసింది, దీనిపై ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతివ్వాలని న్యాయవాదులు కోరారు. ఇందుకు తన అనుమతి అవసరం లేదని జస్టిస్‌ జోసెఫ్‌ స్పష్టం చేశారు. ‘మీ ఇష్టం.. మీరు సీజేఐ ముందు ప్రస్తావించాలనుకుంటే ప్రస్తావించవచ్చు. అయితే నేను జూన్‌లో రిటైరవుతున్నాను. ఆ విషయం కూడా ప్రధాన న్యాయమూర్తికి చెప్పండి. రిటైరయ్యేలోపు ఈ కేసు విచారణ పూర్తి కావాలని కోరుకుంటున్నాను’ అని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు.

Related Articles