ఇద్దరి విచారణకు నేడే ముహూర్తం..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఒకే రోజు విచారించాలని సీబీఐ నిర్ణయించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌ రావాలని అవినాశ్‌కు, కడప సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌకు రావాలని భాస్కర్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు స్వయంగా శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. అలాగే సోమవారం కడప రావాలని భాస్కర్‌రెడ్డికి వేరుగా నోటీసులిచ్చారు. ఇప్పటికే అవినాశ్‌రెడ్డిని జనవరి 28న, ఫిబ్రవరి 24న సీబీఐ ప్రశ్నించింది. వాస్తవానికి ఈ నెల 12న కడపలో విచారణకు హాజరుకావాలని భాస్కర్‌రెడ్డికి మూడ్రోజుల క్రితమే నోటీసులిచ్చింది. ఆయన్ను పిలవడం ఇదే మొదటిసారి. అయితే చెప్పిన తేదీకి ఆర్రోజుల ముందే విచారణకు రమ్మని ఆయన్ను పిలవడం ఆసక్తి రేపుతోంది. కాగా.. సోమవారం తాను విచారణకు రాలేనని అవినాశ్‌రెడ్డి సీబీఐకి లేఖ రాసినట్లు తెలిసింది. పులివెందులలో పార్టీ కార్యకర్తల సమావేశం ఉన్నందున హాజరుకాలేనని తెలిపారని.. ఈ లేఖపై సీబీఐ స్పందించలేదని సమాచారం. దీంతో అవినాశ్‌ హాజరుపై సందిగ్ధత నెలకొంది.

Related Articles