హోలీ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సాలో పిడిగుద్దులాట నిర్వహించారు. గ్రామస్థులు రెండు వర్గాలు గా విడిపోయి సాయంత్రం 6.26 నిమిషాలకు హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్నారు. అడ్డుగా కట్టిన తాడుకు ఇరువైపులా నిలబడి పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఆట సుమారు 8 నిమిషాల పాటు సాగింది. ఆటను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఆటను నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం కలుగుతుందని గ్రామస్థులు చెప్తున్నారు. పిడిగుద్దులాట ప్రారంభానికి ముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు నిర్వహించారు.