హెచ్ఎండీఏ శనివారం ఉప్పల్ భగాయత్‌లోని ప్లాట్లను ఈ-వేలం నిర్వహించింది. మొదటి దశలో 29 ప్లాట్లను ఈ-వేలం వేశారు. ఒక్కరోజే 52 ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.155 కోట్ల ఆదాయం వచ్చింది. 6623.5 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 29 ప్లాట్ల విక్రయం ద్వారా రూ.40.04 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 166 చదరపు గజాల 1302వ నంబర్ ప్లాట్‌ను చదరపు గజాన్ని రూ.77 వేల చొప్పున రూ.1.27 కోట్లకు ఓ బిడ్డర్ కొనుగోలు చేశారు. మొదటి దశలో విక్రయించిన ప్లాట్లన్నీ 300 చదరపు గజాల లోపువే కావడం గమనార్హం.
రెండో దశ
రెండో దశలో 29 ప్లాట్లకు 23 ప్లాట్లను మాత్రమే విక్రయించారు. 822 చదరపు గజాల 105వ నంబర్ ప్లాట్‌ను అత్యధికంగా చదరపు గజం రూ.76,600 చొప్పున రూ.6.29 కోట్లకు ఓ బిడ్డర్ దక్కించుకోగా.. అత్యల్పంగా 1,775 చదరపు గజాల 1402వ నంబర్ ప్లాట్‌ను చదరపు గజం రూ.30,200 చొప్పున రూ.5.34 కోట్లకు మరో బిడ్డర్ దక్కించుకున్నారు. రెండు ప్లాట్లకు ఎలాంటి బిడ్ దాఖలు కాలేదు.
నాలుగు ప్లాట్లకు ఒక్కొక్కరు మాత్రమే బిడ్ వేయడంతో వాటి ఈ-వేలాన్ని నిలిపివేశారు. దీంతో 29 ప్లాట్లకు గాను 23 ప్లాట్లను విక్రయించారు.