ఉప్పల్ భగాయత్‌లో ఆదివారం కూడా అదే ఊపు కనిపించింది. శనివారం ఈ-వేలంలో గజం ధర అత్యధికంగా రూ.77 వేలు పలకగా ఆదివారం రూ.79,900కు పెరిగింది. ఉప్పల్ భగాయత్‌లోని 124 ప్లాట్లకు ఈ-వేలాన్ని హెచ్‌ఎండీఏ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం 525 గజాల ప్లాట్‌ను గజం రూ.79,900 చొప్పున రికార్డు ధరకు కొన్నారు. ఒక్క రోజులోనే గజం ధర రూ.2,900 అధికంగా పలికింది. రెండో రోజు మొత్తం 41 ప్లాట్లను ఈ-వేలం వేయగా హెచ్‌ఎండీఏకు రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యల్పంగా గజం రూ.30,200 పలికింది.
శని, ఆదివారాల్లో జరిగిన ఈ-వేలంలో అత్యధిక మంది బిడ్డర్లు చిన్న ప్లాట్లను కొనడానికి ఆసక్తి చూపారు. శనివారం మొదటి దశలో ఈ-వేలం నిర్వహించిన 29 ప్లాట్లన్నీ 300 గజాల్లోపువే. ఆదివారం మొదటి దశలో ఈ-వేలం జరిగిన 23 ప్లాట్లూ 500 గజాల్లోపువే. సోమవారం కమర్షియల్, మల్టీపర్పస్ జోన్‌లోని ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించనున్నారు. దీని ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిసున్నారు.