నేడు ఆఖరి పోరు..

నేడు పుణే వేదికగా జరిగే మూడో వన్డేలో భారత్, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా … ఈ పోరుతో అంతిమ విజయం ఎవరిదో తేల నుంది. గత మ్యాచ్‌ అందించిన ఫలితంతో ఇంగ్లండ్‌ జట్టులో ఉత్సాహం పెరగ్గా… భారత్‌ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై రెండో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఏకంగా 20 సిక్స్‌లు బాదారు. 337 పరుగుల లక్ష్య ఛేదన ఆ జట్టుకు నల్లేరు మీద నడకే అయింది. స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, కృనాల్ పాండ్య ఘోరంగా విఫలమైన వేళ.. రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. బెయిర్‌ స్టో, స్టోక్స్ విధ్వంసక బ్యాటింగ్‌లో భారత స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నారు. ఏకంగా ఎనిమిది సిక్సులు సమర్పించుకున్న కుల్‌దీప్.. అత్యధిక సిక్సులు ఇచ్చిన భారత బౌలర్‌గా అవాంఛనీయ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. తొలి వన్డేలో 64 పరుగులు ఇచ్చిన అతడు రెండో వన్డేలో ఏకంగా 84 పరుగులు ఇచ్చేశాడు. కృనాల్ అయితే కేవలం ఆరు ఓవర్లలోనే 72 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో భారత్.. చివరి మ్యాచ్‌కు వీళ్లిద్దరి స్థానంలో చాహాల్, సుందర్‌లకు తుది జట్టులో చోటు కల్పించవచ్చు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, హార్దిక్, సుందర్, శార్దుల్‌/నటరాజన్, భువనేశ్వర్, కుల్దీప్‌/చహల్, ప్రసిధ్‌ కృష్ణ.
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, మలాన్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్‌ కరన్, ఆదిల్‌ రషీద్, టాప్లీ, వుడ్‌.

Related Articles