కోమటిరెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. శివాలయం ప్రారంభోత్సవంతో పాటు బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎంపీ గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో భక్తులు, కాంగ్రెస్‌ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలో రూ. 5లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని, గ్రామాల్లో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను పట్టించుకోకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. మాధారం నుంచి ఇటుకులపాడు వరకు 4 కి.మీ. రోడ్డుపై తాను ప్రయాణించడానికి గంట సమయం పట్టిందని ఎంపీ అనడంతో అక్కడే ఉన్న కొంతమంది బీఆర్‌ఎస్‌ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయంలో రాజకీయాలు మాట్లాడడం పద్ధతి కాదని ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దాంతో అక్కడున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి కుర్చీలు, చెప్పులు విసురుకున్నారు. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది.

Related Articles