హీరో నితిన్ సినిమా ‘ఆటాడిస్తా’ సినిమాలో ఎమ్మెల్యే బోనాల శంకర్ పాత్రలా ఉంది… ఇపుడు గౌతమ్ అదానీ పరిస్థితి. ‘ఆడు నన్ను కొట్టలే’ అని శంకర్ ఎలా అంటాడో..అలా తన కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లను ఎవరూ జప్తు చేయలేదని అదానీ పదే పదే చెబుతున్నా మార్కెట్ నమ్మడం లేదు. ఎందుకంటే సినిమా హీరో నితిన్ ఎలాగైతే నో కామెంట్ అని తప్పించుకున్నాడో… ఇపుడు సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్ కూడా ఇప్పటి వరకు నో కామెంట్ అంటూ ఏమీ చెప్పడం లేదు. దీంతో ప్రతి రోజూ సగంపై షేర్లు లోయర్ సీలింగ్ పడుతున్నాయి. నిఫ్టిలో ఉన్న ఏకైక షేర్ అదానీ పోర్ట్స్ దాదాపు రోజై టాప్ లూజర్స్‌లో నంబర్ వన్‌గా ఉంటోంది. ఇవాళ కూడా ఆ షేర్ అత్యధికంగా నష్టపోయిన నిఫ్టి షేర్లలో ముందుంది. ఒకదశలో పది శాతం క్షీణించిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేర్ ఇవాళ 8.99 శాతం నష్టంతో రూ. 643.20 వద్ద ముగిసింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా…
గ్రూప్‌లో ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా ఇవాళ 6.37 శాతం నష్టంతో రూ. 1,356 వద్ద ముగిసింది. ఇక మిగిలిన షేర్లన్నీ లోయర్ సీలింగ్‌లో ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జి లిమిటెడ్ కంపెనీ షేర్ ఇవాళ 5 శాతం క్షీణించి
రూ. 1,123.65 వద్ద ముగిసింది. ఈ కౌంటర్‌లో కొనుగోలుదారులు లేరు. ఇక అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ షేర్ కూడా లోయర్ సీలింగ్ 5 శాతం నష్టపోయి రూ. 1,305.40 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద 37,530 షేర్లు అమ్మకానికి ఉన్నాయి. కొనే వారు లేరు. ఇక అదానీ పవర్ పరిస్థితి కూడా అంతే. ఈ ఖంపెనీ షేర్ లోయర్ సీలింగ్ 4.99 శాతం నష్టంతో రూ. 120.90 వద్ద ముగిసింది. ఈ కౌంటర్‌లో ఈ ధర వద్ద 12,62,998 షేర్లు అమ్మకానికి ఉన్నా కోనేవారు లేరు. ఇక అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్ 5 శాతం నష్టంతో రూ. 1,324.65 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద 46,601 షేర్లు ఉన్నా కొనేవారు లేరు. మరి ఈ డౌన్ ట్రెండ్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియక సాధారణ ఇన్వెస్టర్లు టెన్షన్‌లో ఉన్నారు. అమ్మకందారుల స్థాయిలో కొనుగోలుదారులు లేకున్నా… ఈ కౌంటర్లలో కొనుగోళ్లు జరుగుతన్నాయి.