గ్లాండ్‌ ఫార్మా IPO రేపే… సబ్‌స్క్రయిబ్‌ చేస్తున్నారా?

హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మా రేపు ఓ రికార్డు సృష్టించబోతోంది. దేశీయ ఫార్మా రంగం నుంచి అతి పెద్ద తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ప్రారంభం అవుతోంది. ఇ ఆఫర్‌ ద్వారా రూ. 6,500 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. పబ్లిక్‌ ఆఫర్‌ ధర రూ.1,490-రూ. 1,500. షేర్‌ ముఖ విలువ కేవలం రూపాయి మాత్రమే. గత వారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి గ్లాండ్‌ ఫార్మా కంపెనీ రూ. 1,944 కోట్ల సమీకరించింది. రూ. 1,500 ధర చొప్పున వీటికి కేటాయించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లలో సింగపూర్ ప్రభుత్వం, నొమురా, గోల్డ్‌మ్యాన్ శాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి.

ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో కొత్తగా ఇష్యూ చేస్తున్న షేర్లు కేవలం 0.8శాతం మాత్రమే. ఈ షేర్ల ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరిస్తున్నారంతే. మిగిలిన మొత్తం ఉన్న వాటాదారులు తమ దగ్గరున్న వాటాల్లో కొంత మొత్తాన్ని ఈ ఆఫర్‌ ద్వారా విక్రయిస్తున్నారు. గ్లాండ్‌ ఫార్మాలో మెజారిటీ వాటా చైనాకు చెందిన షాంఘై ఫోసన్‌ ఫార్మాకు ఉంది. ఫోసన్‌ సింగపూర్‌ అనే తన అనుబంధ కంపెనీ ద్వారా గ్లాండ్‌ ఫార్మాలో 74 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాదారుల్లో గ్లాండ్‌ సెల్సస్‌ (12.97శాతం), ఎంపవర్‌ ట్రస్ట్‌ (5.08 శాతం), నిలయ్‌ ట్రస్ట్‌ (2.42 శాతం) వాటా ఉంది. మీరు తమ వద్ద ఉన్న షేర్లలో 3.48 కోట్ల వరకు షేర్లను ఆఫర్‌ చేస్తున్నారు. ఐపిఓ తరువాత చైనా ప్రమోటర్ వాటా 74శాతం నుండి 58శాతానికి పడిపోతుంది.
ఐపీఓలో లాట్ సైజు 10 షేర్లు. అంటే ఇన్వెస్టర్లు కనీసం పది షేర్లకు దరఖాస్తు చేయాలి. అంతకన్నా ఎక్కువ షేర్లకు దరఖాస్తు చేసేవారు 10 షేర్ల గుణిజాలతో చేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు 35% షేర్లను ఆఫర్‌ చేస్తున్నారు.
రేపు ప్రారంభమయ్యే పబ్లిక్ ఆఫర్‌ బుధవారంతో ముగుస్తుంది.షేర్లను ఈనెల 17 లోపు అలాట్‌ చేసే అవకాశముంది. ఈనెల 20న రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ)లలో గ్లాండ్ ఫార్మా షేర్లు లిస్టయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా 1978 లో స్థాపించబడింది మరియు 60 దేశాలలో విస్తరించి ఉంది. గ్లాండ్‌ ఫార్మా కంపెనీకి ఓ విశిష్టత ఉంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసే కాంప్లెక్స్‌ మల్టిపుల్‌ ఇంజెక్షన్ల మార్కెట్‌లోకి ఇతర కంపెనీలు రావడం అంత ఈజీ కాదు. ఈ కంపెనీకి దేశంలోనే ఏడు తయారీ యూనిట్లు ఉన్నాయి. కొన్ని ఔషధాల విషయంలో ఈ కంపెనీకి పోటీ తక్కువ. కంపెనీ వ్యాపారంలో మూడోవంతు అమెరికా మార్కెట్‌ నుంచే వస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు ఎంత గట్టి కస్టమర్లు ఉన్నారంటే… తన తొలి అయిదుగురు కస్టమర్ల నుంచే 49శాతం వ్యాపారం వస్తుంది.
గత కొన్నేళ్ళుగా కనీసం 20 శాతం సగటు వృద్ధి రేటుతో ఈ కంపెనీ ముందుకు సాగుతోంది.

2020 జూన్‌ త్రైమాసికంలో కంపెనీ సాధించిన వార్షిక ఈపీఎస్‌కు 18.52 రెట్లకు ఇష్యూ ధరను నిర్ణయించారు. అదే టీటీఎం (Trailing 12 Month) పీఈతో పోలిస్తే ఇష్యూ ధరను 31.7 రెట్లు అధికంగా నిర్ణయించినట్లు విశ్లేషకులు అంటున్నారు. పరిశ్రమ కూడా ఇదే పీఈ మల్టిపుల్స్‌తో నడుస్తోందని, కాబట్టి ఇష్యూ ధర సరిగ్గా లేదా కాస్త ఎక్కువగా ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లను చూస్తే రెసిఫార్మ్ 44 రెట్లు, లోంజా 55 రెట్ల పీఈతో షేర్లు ట్రేడవుతున్నాయి. ఫార్మా రంగం ప్రస్తుతం మంచి ఊపు మీద ఉండటం, కంపెనీ ఉత్పత్తులకు గట్టి మార్కెట్‌ దృష్టి పెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీర్ఘాకలిక ఇన్వెస్టర్లకు ఈ ఇష్యూ ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌గా చెప్పొచ్చని మెజారిటీ విశ్లేషకులు అంటున్నారు.

సో.. కాస్త ఓపిక ఉన్నవారికి ఇది సురక్షిత ఇష్యూ. చైనా కంపెనీకి ఇష్యూ తరవాత కూడా మెజారిటీ వాటా ఉండటం, కంపెనీ ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ దృష్ట్యా దరఖాస్తు చేయొచ్చు.

Related Articles