కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. చెరుకు సుధాకర్ తనయుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. సుధాకర్‌ను చంపేందుకు తన అభిమానులు వంద కార్లలో బయటికి వచ్చారంటూ దాదాపు 2 నిమిషాలపాటు బూతులు తిట్టారు. అంతేకాదు ‘నిన్ను కూడా చంపుతారు. నీ ఆస్పత్రిని కూలగొడతారు’ అని సుహాస్‌ను బెదిరించారు. ఈ ఆడియో ఆదివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ‘మీ నాన్నను చంపేందుకు 100 కార్లలో తిరుగుతున్నారు. వాడు నన్ను 100 సార్లు తిట్టిండు. నా అభిమానులు నెలరోజులు ఓపిక పట్టి, ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నారు. నిన్ను కూడా చంపుతారు. నీ హాస్పిటల్ కూలగొడతారు. లక్షల మందిని నేను బతికించిన. వానికెంత ధైర్యం. నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిండు. వాడిని వదిలిపెట్టను. నీకు చెప్తున్నా. వార్నింగ్ ఇస్తున్నా. నా పేరు తీసుకుని మొన్న స్టేట్‌మెంట్ ఇచ్చిండు. మావాళ్లు మొన్నటిదాకా ఓపిక పట్టారు. ఇగ మా వల్ల కాదు సార్ అంటున్నారు. మేం బయటికి ఎల్లినం. ఆడు యాడదొరికితే ఆడ చంపేస్తామంటున్నరు. ఇగ నాతోని కాదు. వాడు క్షమాపణ చెప్పకపోతే చంపేస్తరు. డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్లింది. నిన్ను కూడా చంపుతారురా అరేయ్. నీ ఆస్పత్రి నడవదు. నేను 25 ఏళ్లలో లక్షల మందిని బతికించినా. వాళ్లందరినీ నేను కంట్రోల్ చేస్తానా? ఫోన్ చేసి చెప్పు మీ నాయనకి. అరేయ్.. నీకు పార్టీ ఉందారా? ఇంటి పార్టీ ఏందిరా? కౌన్సిలర్‌గా గెలవడు. ఎంతపెద్ద లీడర్ వాడు? జైలులో పెడితే నేనొక్కడినే పోయినా. అప్పుడు ఎవరూ పోలే. చెప్పు.. వాడికి రోజులు దగ్గరపడ్డాయి. వారం రోజుల కంటే ఎక్కువ ఉండడు’ అంటూ రెండు నిమిషాల పాటు సాగిన సంభాషణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.