ఆంధ్రాలో అన్ని చోట్లా బీఆర్ఎస్ పోటీ..

వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ వెల్లడించారు. విజయవాడలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ మోడల్‌నే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని.. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ కేంద్ర ప్రభుత్వం సహకారం రావడం లేదన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, బీజేపీని ఎదుర్కొనే శక్తి ఆ పార్టీకి లేదని పేర్కొన్నారు. అందుకే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఏపీలో ఎన్నో సమస్యలు తలెత్తాయని.. ఇప్పటి వరకు రాజధాని లేదని తోట చంద్రశేఖర్ అన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని.. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇప్పటికీ మెట్రో రైలు సౌకర్యం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. వీటిపై కేంద్రాన్ని నిలదీసిన వాళ్లు ఎవరూ లేరని.. కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని అభిప్రాయపడ్డారు.

Related Articles