ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబుకు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అశోక్‌బాబును టీడీపీ కోవర్ట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈ విమర్శలు చేసిన రెండు రోజులకే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణ ఇంటిపై దాడి కలకలం రేపింది. గురువారం వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వరికూటి అశోక్‌బాబు టంగుటూరులో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణ ఇంటికి వెళ్లారు. తనను ఎందుకు దూషిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అరుణ ఇంట్లో లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి వెళ్లి టంగుటూరు వాణీనగర్‌లో నివాసం ఉంటున్న మరో వైసీపీ నేత తేళ్ల డేవిడ్ ఇంటికి వెళ్లారు.. అక్కడ వాగ్వాదం జరిగింది. అశోక్‌బాబు మళ్లీ మధ్యాహ్నం అనుచరులతో కలిసి బొడ్డపాటి అరుణ ఇంటికి వెళ్లారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడమేంటని.. అశోక్‌బాబు వర్గీయులు అరుణ, ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారు. ఈ తోపులాటలో అరుణ తండ్రి రావూరి వెంకట శేషయ్య స్పృహ కోల్పోయారు. రెచ్చిపోయిన అశోక్‌బాబు వర్గీయులు ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. అరుణ అశోక్‌బాబుకు క్షమాపణలు చెప్పాలని పెద్దగా నినాదాలు చేశారు. అరుణతో పాటూ ఆమె వర్గీయులపై దాడికి ప్రయత్నించారు.