భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు, ఓయూ స్టూడెంట్ భైరి నరేష్‌పై మళ్లీ దాడి జరిగింది. హనుమకొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్థానికులు అతనిపై విరుచుకుపడ్డారు. బైరి నరేష్ చేసిన వ్యాఖ్యల కారణంగానో లేదా మరే కారణాల వల్లో కానీ.. ఆగ్రహానికి లోనైన స్థానికులు.. బైరి నరేష్ బట్టలు విప్పి మరీ కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో ఎక్కించారు. అయితే.. ఆగ్రహంతో ఊగిపోతున్న యువకుడు ఏకంగా పోలీస్ వాహనంలోకి ఎక్కి మరీ.. బైరి నరేష్‌ను కొట్టారు. పోలీసులు ఎంతగా నివారించేందుకు ప్రయత్నించినా.. భైరి నరేష్‌పై దాడిని ఆపలేకపోయారు. గతంలో భైరి నరేష్ అయ్యప్ప దేవునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు చోట్ల అయ్యప్ప భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనలు చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై బైరి నరేష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యాడు భైరి నరేష్. అయితే.. విడుదలై వచ్చి మరోసారి తన వ్యాఖ్యలతో మంట పెట్టాడు.