గన్నవరంలో విధ్వంసకాండ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యాలయంపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్లు బాదారు. కార్యాలయం ఆవరణలోని పలు కార్లను ధ్వంసం చేశారు. ఓ కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. అయితే.. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు గన్నవరంకు బయల్దేరి వెళ్లారు. టీడీపీ నేతలకు అండగా నిలబడేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘటనాస్థలానికి వెళ్లగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం, కార్లు తగలపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వాళ్లను అరెస్ట్ చేయాల్సింది పోయి.. తనను అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను ఉమా ప్రశ్నించారు. అసలు ఆయన మాటలను లెక్కచేయని పోలీసులు బలవంతంగా పోలీసు కారులో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఇంతవరకూ తెలియని పరిస్థితి. ఉమా ఒక్కరే కాదు టీడీపీ నేతలు చాలా మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలో కార్యాలయాన్ని పరిశీలించడానికి వెళ్లిన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావును కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.

Related Articles