పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌కు చేదు అనుభవం ఎదురైంది. కూచ్‌బెహార్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. నిశిత్ ప్రామాణిక్ కూచ్‌బెహార్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం ఆయన స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు అద్దం పగిలిపోయింది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు వెనక్కితగ్గకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.