ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిసోడియాను హత్య చేయడానికే అక్కడ ఉంచారేమోనని, ఆయనకు అక్కడ ప్రాణహాని ఉన్నదని ఆరోపించారు. అసలు మొదటిసారి ఖైదీ అయిన వ్యక్తిని అలాంటి నేరస్థులతో ఉంచుతారా? అని ప్రశ్నించారు. ఒక అండర్‌ట్రైల్ ఖైదీని సెల్ నెంబర్1లో ఉంచరని, అందులో హంతకులు, కరడుగట్టిన నేరస్థులు, కొందరు పిచ్చివాళ్లు కూడా ఉంటారని మరో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను తీహార్ జైలు అధికారులు కొట్టివేస్తూ సిసోడియా భద్రత దృష్ట్యా అతడిని వేరొక వార్డుకు మారుస్తున్నట్టు తెలిపారు. వీలైతే ప్రత్యే సెల్ కేటాయిస్తామన్నారు.