మోడీ వల్ల బాగుపడింది వాళ్ళే

ఇటీవల ఇండియా టుడే, సీ ఓటర్‌ జరిపిన సర్వే తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది. ఏపీ అధికార వైసీపీకి ఓటమి ఖాయమని అని చెప్పిన ఈ సర్వే తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ కేవలం మూడు ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. మరోవైపు జాతీయ స్థాయిలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సాధారణ మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది. మిత్ర పక్షాలతో కలిసి 300లకు పైగా స్థానాలు ఎన్డీఏకు వస్తాయని పేర్కొంది. ముఖ్యంగా పలు కీలక అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వంపై సాధారణ ఓటర్లు అసంతృప్తితో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల బాగుపడింది పెద్ద పారిశ్రామిక వేత్తలనేనని సర్వేలో పాల్గొన్న 52 శాతం మంది పేర్కొన్నారు. చిన్న పరిశ్రమలు బాగుపడ్డాయని చెప్పినవారి శాతం 11 శాతం కాగా, రైతులు బాగుపడ్డారని చెప్పినవారి సంఖ్య కేవలం 9 శాతం. మోడీ పాలనలో ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. ద్రవ్యోల్బణం కారణంగా సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగుల జీవితం కూడా కష్టాలపాలైందని చాలా మంది అభిప్రాయపడ్డారు. మోడీ విధానాల వల్ల ఉద్యోగులు బాగుపడ్డారని చెప్పినవారి శాతం కేవలం 8 శాతం మాత్రమే ఉండటం ఈ సర్వే విశేషం.

Related Articles