అమ్మకానికి వైజాగ్‌ స్టీల్‌… కేబినెట్‌ ఓకే

32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ కంపెనీల చేతిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖపట్నం వంటి చక్కటి తీర ప్రాంతంతో పాటు సమీపంలోనే భారీ ముడి ఖనిజం కలిగిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాట్‌ను ప్రైవేటీకరించడమంటే… ఏపీలోని కీలక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల చేతి నుంచి చేజారిపోవడమే. స్థానిక ప్రజల జీవితాలు ప్రైవేట్‌ కంపెనీల చేతిలో పెట్టడమే. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL) పేరుతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. RINLను ప్రైవేట్‌ కంపెనీలకు అమ్మేసేందుకు ఇవాళ ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ ఆమోద ముద్ర వేసినట్లు అధికారవర్గాలు ధృవీకరించాయి. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ కంపెనీకి అత్యంత కీలకమైన రెండు ఖనిజ గనులు కూడా ఉన్నాయి. వాటిని కలిపి అమ్మేయాలా లేదా వాటిని విడదీసి అమ్మేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీ వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. కొనుగోలుచేసే ప్రైవేట్‌ కంపెనీలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఆర్థిక శాఖకు ఇచ్చారు. ఏడాదికి 73 లక్షల మెట్రికల్‌ టన్నుల లాంగ్‌ ప్రొడక్ట్‌ స్టీల్‌ను తయారు చేసే సామర్థ్యం వైజాగ్‌ స్టీల్‌కు ఉంది. ఈ కంపెనీకి అవసరమైన ముడి ఖనిజాన్ని సొంత కంపెనీల నుంచే లభిస్తోంది. ఒడిశా మినరల్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (OMDC) బిర్సా స్టోన్‌ లైమ్‌ కంపెనీలు వైజాగ్‌ స్టీల్‌కు అవసరమైన ముడి ఖనిజాన్ని సరఫరా చేస్తాయి. ఇవి రెండూ వైజాగ్‌ స్టీల్‌ కంపెనీవే. అమ్మేసే సమయంలో ఈ రెండిండింటిని కూడా అమ్మేస్తారని తెలుస్తోంది. ఇవి గాకుండా MOIL కంపెనీతో కలిసి చెరి సమాన వాటాతో RINL MOIL ఫెర్రో అల్లాయ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా వైజాగ్‌ స్టీల్‌కు ఉంది. అలాగే పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో కలిసి సమాన వాటాతో RINL పవర్‌ గ్రిడ్‌ టీఎల్‌టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మరో కంపెనీ కూడా ఉంది. వైజాగ్‌ స్టీల్‌ను అమ్మడమంటే ఈ వాటాలను కూడా వొదులుకోవడమే.

విస్తరించాలని…
మరోవైపు ఎంతో కీలక ప్రాంతంలో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ను మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. దక్షిణ కొరియాకు చెందిన పొస్కోతో కలిసి భారీ ఎత్తున స్టీల్‌ ప్లాంట్‌ విస్తరించే ప్రణాళికను కూడా వైజాగ్‌ స్టీల్‌ సిద్ధం చేసింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. కేబినెట్ తాజా నిర్ణయంతో ఈ ఒప్పందం భవిష్యత్తు కూడా అయోమయంలో పడింది.

స్టీల్‌ కంపెనీలు సూపర్‌
అనేక సంవత్సరాల తరవాత స్టీల్‌ కంపెనీలు రాణిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో స్టీల్‌ కంపెనీలు ఆకర్షణీయ లాభాలతో నడుస్తున్నాయి. ముఖ్యంగా టాటా స్టీల్‌, జీఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వంటి కంపెనీల షేర్లు ఇటీవల రెట్టింపు అయ్యాయి. స్టీల్‌ ఉత్పత్తుల ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఇంత లాభదాయక సంస్థను ప్రైవేట్‌ కంపెనీల చేతిలో పెట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఏపీకి ఓ పెద్ద సవాలే.

Related Articles