రేవంత్‌రెడ్డి, వైస్ షర్మిల పాదయాత్రల పరువు తీస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా రేవంత్, షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని మీరు నా గురించి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలే.. చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేదంటే మీరు పదవులు వదిలి రాజకీయ సన్యాసం తీసుకుంటారా?’ అని సవాల్ చేశారు. ‘రేవంత్ మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్లందరి పైనా భూ కబ్జా కేసులు ఉన్నాయి. వాళ్లు ప్రజల కోసం జైలుకు పోలే. కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాల కేసుల్లో జైలుకు పోయారు’ అని మండిపడ్డారు. ‘నేను పట్టుబట్టి 15మంది ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించా. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏం చేశావో చెప్పు రేవంత్.. నీ మీద ఉద్యమ కేసు ఒకటైనా ఉందా?’ అని నిలదీశారు. ‘రాజకీయాల్లో మా నాయిన, నేను మచ్చ లేకుండా ఉన్నాం. మీకు మా గురించి మాట్లాడే అర్హత, హకులు లేవు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ప్రజల కోసం జైలుకు పోయిన. నీటి కోసం బాబ్లీకి పోయి పోలీసులతో దెబ్బలు తిన్న. రైతుల కోసం ఇప్పటికీ కేసులు అనుభవిస్తున్నా. గ్రానైట్ సమస్యలపై పోరాడితే అనంతపూర్‌లో కేసులు పెట్టిన్రు’ అని చెప్పారు. ‘నేను రాజకీయాల్లో మళ్లీ గెలుస్తా.. ఎకడ నిలబెట్టినా మళ్లీ మళ్లీ గెలుస్తా.. ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయని నువ్వు నీ కొడంగల్‌లో మళ్లీ గెలుస్తవా? మలాజిగిరిలో మళ్లీ పోటీ చేస్తావా?’ అని రేవంత్‌ను ప్రశ్నించారు. ‘నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే. నీ గురించి నీ కాంగ్రెస్ వాళ్లే మాట్లాడుతున్నరు’ అని ఎద్దేవా చేశారు.