రేపు సీఎల్పీ అత్యవసర భేటీ

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, సీఎల్పీ యాక్టివ్‌గా ఉంటారు. ఆ తరవాత పార్టీ కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చూసుకుంటారు. అంతా ఆయన ఆదేశాల మేరకే జరుగుతుంది. కాని తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ పార్టీ కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నారు. కొత్తగూడంలో వనమ రాఘవ అకృత్యాలు, ఆగడాలకు బలైన వారికి అండగా ఉండాలని ఎమ్మెల్యే జగ్గా రెడ్డి భావించారు. మరి వెంటనే ఆయన పీసీసీతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలి. కాని ఆయన నేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్‌ చేయడం, రేపు సీఎల్పీ అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి. సీఎల్పీ భేటీ అంటే రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం ఉండదా? అంటే ఎమ్మెల్యేలు విడిగా కార్యాచరణ నిర్ణయిస్తారా? తెరాసకు తామే ప్రత్యామ్నాయం అనేలా బీజేపీ ఏదో ఒక కార్యక్రమంతో ముందుకు పోతోంది. బీజేపీ ఎపుడూ వార్తల్లో ఉండేలా టీఆర్‌ఎస్‌ కూడా తన వంతు సాయం చేస్తోంది. ఏమీ లేని కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం అశోక్‌ చౌహాన్‌ రావడం ఒక ఎత్తయితే… ఆ మాటలను ఖండించడానికి టీఆర్‌ఎస్‌ మంత్రులు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మరో చిత్రం. ఎందుకంటే అశోక్‌ చౌహాన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కాని టీఆర్‌ఎస్‌ మరీ ఆయనను విమర్శించి… బీజేపీని హైలెట్‌ చేస్తోంది. ఆ రెండు పార్టీల వ్యూహం అలా ఉంటే… కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కలహాలతో బజారున పడుతోంది.

Related Articles