ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై ఈడీ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌ బొగ్గు గనుల కుంభకోణం కేసులో ఈడీ మరోసారి దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ లోని అధికార కాంగ్రెస్‌ నేతల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో సోమవారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. రాయ్‌పూర్‌లో ఈ నెల 24 నుంచి 26 మధ్య కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగడం గమనార్హం. ఎమ్మెల్యే దేవేందర్‌ యాదవ్‌, పీసీసీ ట్రెజరర్‌ రామ్‌గోపాల్‌ అగర్వాల్‌, అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌, తదితర నేతల ఇండ్లలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. బొగ్గు స్కామ్‌లో లబ్ధి పొందినట్టు భావిస్తున్న వారిని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, పార్టీ నేతల ఇండ్లలో ఈడీ సోదాలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు నిరసనగా సోమవారం ఉదయం రాయ్‌పూర్‌లోని ఈడీ ఆఫీసు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. 24 నుంచి 26 వరకు పార్టీ ప్లీనరీ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని, ఇవేమీ తమను అడ్డుకోలేవని ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ స్పష్టంచేశారు. పూర్తిగా రాజకీయ ప్రతీకార దాడులేనన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర’ విజయవంతం కావడం, అదానీ గ్రూపు లింకులు బయటకు రావడంతో బీజేపీ నిరాశ చెందుతోందని చెప్పారు. ఈ అంశాల నుంచి దృష్టిని మళ్లించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి చర్యలు కాంగ్రెస్‌ నేతలను భయపెట్టలేవన్నారు.

Related Articles