డబ్బుల కోసం కన్న కొడుకే కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తల్లిదండ్రుల నుంచి డబ్బులు లాగేందుకు ఓ మహిళతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు. విషయం బోధపడక ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కిడ్నాప్ నాటకం ఆడింది కుమారుడేనన్న నిజం వెలుగుచూసింది. మియాపూర్ ఠాణా పరిధిలోని మక్తా హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముండే సంజీవరావు మేస్త్రీ. ఆయన కుమారుడు కంకి పవన్‌కుమార్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన పవన్ రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ పవన్‌కుమార్ తల్లికి ఫోన్ చేసి రూ.50 వేలు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే కుమారుడిని చంపేస్తానని హెచ్చరించింది. సదరు ఫోన్ నంబర్ సిగ్నల్ ఆధారంగా మియాపూర్ డీఐ కాంతారెడ్డి నేతృత్వంలోని క్రైం బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియురాలు రాధికతో కలిసి కంకి పవన్ కుమార్ కిడ్నాప్ డ్రామా ఆడి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు లాగాలని ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది. ఫోన్‌కాల్ వచ్చిన ఆరు గంటల వ్యవధిలోనే పవన్‌కుమార్, రాధికను పోలీసులు అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు.