జగన్‌ ప్రభుత్వాన్ని ప్రపంచ కోర్టుకు లాగుతాం

(అమరావతి నుంచి కె స్రవంతి చంద్ర)

క్లీన్‌ ఎనర్జి ప్రాజెక్టుల వ్యవహారం… ఏపీ ప్రభుత్వం ఊహించని మలుపులు తిరుగుతోంది.. కేంద్రం ఎంత వారించినా… సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో జగన్‌ ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది… కోర్టు తీర్పును కూడా జగన్‌ బేఖాతరు చేస్తున్నారని కొన్ని విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయకపోతే ఇతర రాష్ట్రాలు కూడా జగన్‌ ప్రభుత్వ బాటలో నడిచే ప్రమాదముందని అంతర్జాతీయ కంపెనీలు ఆందోళనతో ఉన్నాయి. దీంతో తమ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయ కోర్టు ఆర్బిట్రేషన్‌ కు తీసుకెళ్ళాలని యోచిస్తున్నాయి. దాదాపు 7000 మెగా వాట్ల సోలార్‌, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులపై వివిధ దేశాలకు చెందిన కంపెనీలు సుమారు రూ. 40,000 కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నాయి.

అత్యంత పారదర్శక పద్ధతిలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు నిర్వహించిన బిడ్డింగ్‌లో తాము ప్రాజెక్టులను సాధించామని… జగన్‌ ప్రభుత్వం వీటిని రద్దు చేయడమే గాక… బకాయిలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతోందని సదరు కంపెనీల ఆరోపణ. ఈ ప్రాజెక్టులపై కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా పరోక్షంగా పెట్టుబడులు పెట్టాయి. ప్రైవేట్‌ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వీలు కల్పించే క్లాజు లేదని ఏపీ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా కూడా ఏపీ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్ళొచ్చని విదేశీ కంపెనీలు అంటున్నాయి.

రస్‌ అల్‌ఖైమా ఏపీలో ప్రతిపాదించిన బాక్సైట్‌ ప్రాజెక్టు ఒప్పందంలో కూడా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ క్లాజు లేదు. అయినా భారత్, యూఏఈల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను చూపుతూ రస్‌ అల్‌ఖైమా ఏపీ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో పిటీషన్‌ వేసింది. ప్రస్తుతం ఆ కేసును కేంద్రం పరిశీలిస్తోంది. మున్ముందు కేంద్రం జోక్యం తప్పనిసరి కావడంతో… విదేశీ కంపెనీలు కేంద్రంతో టచ్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్ళుతున్నామన్న విషాయన్ని ఇప్పటికే కేంద్రానికి చూచాయగా చెప్పినట్లు తెలుస్తోంది.

వెరసి… క్లీన్‌ ఎనర్జి ప్రాజెక్టుల వ్యవహారం రోజురోజుకీ మరింత జఠిలమౌతోంది…

Related Articles