ఈసారి తెలుగు పత్రికలపై ఎన్నికల ప్రభావం బాగా కన్పించింది. ఎన్నికల తరవాత ప్రతి పత్రికా భారీగా పాఠకులను కోల్పోయింది సాక్షి మినహా. వైకాపా అధికార పత్రిక సాక్షి ఏపీలో తన పాఠకులను కాపాడుకోగా, అదే
టీఆర్‌ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ తన పాఠకులకు కాపాడుకోలేకపోయింది. తెలుగురాష్ట్రాల్లో అత్యధికంగా పాఠకులను పోగొట్టుకన్న దినపత్రిక నమస్తే తెలంగాణ. ద మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్ (MRUC) నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (IRS)గణాంకాలను విడుదల చేసింది.గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో (నాలుగో త్రైమాసికంలో) జరిగిన సర్వే ఇది. దక్షిణాదిలో అత్యధికంగా కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో దిన పత్రికలకు పాఠకులు భారీగా తగ్గారు. 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తంలో ఏడాదిలో వచ్చిన మార్పులను చూస్తే…
టాప్ టెన్ నుంచి ఈనాడు ఔట్
దశాబ్దాల పాటు అన్ని భాషా దిన పత్రికలతో పాటు ప్రాంతీయ దినపత్రికల టాప్ టెన్ చార్ట్‌లో కొనసాగిన ఈనాడు ఈసారి ఆ చార్ట్ నుంచి వైదొలగింది. రెండు చార్ట్‌లలో టైమ్స్ ఆఫ్ ఇండియా మినహాయిస్తే అన్ని ప్రాంతీయ భాషా పత్రికలే. తమిళనాడు పత్రికల పాఠకులు భారీగా పెరగడంతో ఈనాడు ఈ చార్ట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఈనాడు పాఠకులు ఈ ఏడాదిలో భారీ సంఖ్యలో తగ్గారు. 2019 తొలి త్రైమాసికంలో రెండు రాష్ట్రాల్లో కలిపి ఈనాడుకు 1,53,28,000 పాఠకులు ఉండగా, నాలుగో త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 1,15,40,000లకు పడిపోయింది. అంటే 24.71 శాతం పాఠకులను కోల్పోయింది. పతనం తెలంగాణలో అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో 27 శాతం మంది పాఠకులు తగ్గగా, ఏపీలో 22.51 శాతం మంది తగ్గారు.
సాక్షి నిలబడింది
2019 తొలి త్రైమాసికంలోనే వైఎస్ జగన్ సీఎం కావడంతో సాక్షి పత్రిక ఏపీలో నిలదొక్కుకుంది. క్రమంగా పాఠకులను పెంచుకుంది. కాని తెలంగాణలో ఇతర పత్రికల మాదిరిగానే 25 శాతం దాకా పాఠకులను కోల్పోయింది. దీంతో రెండు రాష్ట్రాలు కలిపితే సాక్షి పోగొట్టుకున్న పాఠకుల సంఖ్య కేవలం 3 శాతమే. తెలంగాణ నష్టాన్ని ఏపీలో పూడ్చుకుందన్నమాట. దీంతో మొత్తం పాఠకులు 86.22 లక్షల మంది నుంచి 83.49 లక్షలకు తగ్గారు. ఇక ఆంధ్రజ్యోతి కూడా 24 శాతం మంది పాఠకులను కోల్పోవడంతో పాఠకుల సంఖ్య 62.36 లక్షల నుంచి 47.21 లక్షల మందికి తగ్గింది.
45 శాతం క్షీణత…
నమస్తే తెలంగాణ పాఠకులకు ఏకంగా 45 శాతం తగ్గారు. తొలి త్రైమాసికంలో ఈ పత్రిక పాఠకులు 29.73 లక్షల మంది కాగా, చివరి త్రైమాసికం నాటికి 16.16 లక్షలకు పడిపోయారు. అంటే 45 శాతం పైగా తగ్గారన్నమాట. పత్రిక సగటు పాఠకుల సంఖ్య కూడా 1111 నుంచి 568కి పడిపోయింది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేకపోవడం వల్లనేమో… అన్ని దిన పత్రికల పాఠకుల సంఖ్య భారీగా తగ్గింది.