ఏపీ ఉద్యోగులకు 23% ఫిట్‌మెంట్‌

రాష్ట్ర ప్రభుత్వం 23% ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమక్షంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి పీఆర్‌సీ తదితర అంశాలపై ప్రకటన చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఈ జనవరి 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌ డీఏలన్నింటినీ ఈ నెల నుంచే చెల్లిస్తామని చెప్పారు.

సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10% రిజర్వ్‌ చేయడమే కాకుండా 20% రిబేటుతో ఇవ్వనున్నట్లు తెలిపారు. 2018 జూలై 1 నుంచి పీఆర్సీ, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌ అమలు చేస్తారు. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే ఈ నెల నుంచే ఆ జీతాలు ఇవ్వాలని తాను ఆదేశించినట్లు సీఎం చెప్పారు. కొత్త స్కేల్స్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 2022 జనవరి 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించాం. 21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తిగా చెల్లిస్తారు. సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో– ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10 శాతం రిజర్వ్‌ చేస్తాం. అంతే కాకుండా 20 శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు.

Related Articles