AP: మీడియాపై నిఘాకు వెబ్‌సైట్‌

రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థలు ప్రచురించే, ప్రసారం చేసే వార్తా కథనాలను విశ్లేషించేందుకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రత్యేక డైనమిక్‌ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వ పనితరు సమీక్షించేందుకు అని పైకి చెప్పినా… అసలు ఉద్దేశం మీడియాపై నిఘా వేసేందుకేనని తెలుస్తోంది. ప్రతిరోజు ప్రభుత్వంపై వచ్చే వార్తలను అంశాల వారీగా, విభాగాల వారిగా వివరాలను ఈ వెబ్‌సైట్‌ ద్వారా సేకరిస్తారు. వీటిని జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయి వార్తలను కూడా సేకరించి వర్గీకరిస్తారు. శాఖలవారీగా రాజకీయ, ఎడిటోరియల్‌తో పాటు మీడియాలో వచ్చే వార్తా కథనాలను ప్రభుత్వ అనుకూలం, ప్రతికూలంగా ఉండే వార్తలను విడిగా వర్గీకరించి రోజూ సేకరిస్తారు. ఇలా సేకరించిన వాటిని అంశాలు/విభాగాల వారీగా రోజూ, వారానికి, పక్షానికి, నెలవారీ, ఏడాదివారీగా లెక్క తీసేలా ఈ వెబ్‌సైట్‌లో ఏర్పాటు ఉంటుంది. ఇదే విధంగా వార్తలను వర్గీకరిస్తూ అంతర్‌ రాష్ట్ర, జాతీయ వార్తలను కూడా అప్‌లోడ్‌ చేసేలా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తనకు అనుకూలంగా ఎవరెవరు, ఎన్నిసార్లు, ఎపుడెపుడు వార్తలు రాశారో ఇట్టే తెలుసుకోవచ్చన్నమాట. రోజుకు, వారానికి, నెలకు, ఏడాదికి ఏ మీడియా సంస్థ తనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని వార్తలు రాసిందో తెలుసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఈ మొత్తం వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్‌మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)కి అప్పజెప్పారు. మొత్తం డిజైన్‌, అభివృద్ధికి రూ.7,23,438 ఖర్చవుతుందని ఎన్‌ఐసీ తెలపగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,51,094లను అంటే 90 శాతం మొత్తాన్ని చెల్లించింది.

Related Articles