ఒలింపిక్స్ లో భారత్ ఎక్కడ?

130కోట్లకు పైగా జనాభా …అందులోనూ యువత అధికంగా ఉన్న దేశం ఇండియా…. అలాంటిది ఒలింపిక్స్ లో ఈసారి గోల్డ్ వస్తుందా, రాదా? వస్తే.. ఎన్ని పతకాలు వస్తాయి..ఇలా లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి మనకు దాపురించింది. ఎందుకిలా.. ఓవైపు పొరుగుదేశం చైనా దశాబ్దాల నుంచి పతకాలను పోగేసుకుంటుంటే.. మనం మాత్రం ఎందుకిలా అయిపోతున్నాం..

మన దేశంలో ఒక్క హర్యానా మాత్రమే స్పోర్ట్స్ కు ప్రాధాన్యమిస్తోంది. దేశ జనాభాలో 2.2 శాతం ఉన్నప్పటికీ…. ఆ రాష్ట్రంలో 24 శాతం మంది అధ్లెట్లు ఉన్నారు.మరి మిగిలిన రాష్ట్రాలు ఎందుకు అధ్లెట్లను తయారు చేయలేకపోతున్నాయి. ప్రతీ ఒలింపిక్స్ లోనూ ఎవరో ఓ క్రీడాకారుడు, క్రీడాకారిణి… ఓపతకం తేవడం, వారిని కోట్లతో సన్మానించడంతోనే సరిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది.

పొరుగున ఉన్న చైనా… ఆది నుంచి క్రీడల్లో సోవియట్ మోడల్ ను అనుసరిస్తోంది. చాలా చిన్న వయసులోనే మెరికల్ని గుర్తించి, వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బూట్ క్యాంప్ స్టైల్ ట్రైనింగ్ సెంటర్స్ కు పంపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన కఠిన శిక్షణ అందిస్తోంది. దీంతో వారు భవిష్యత్ పతకాలు అందించే స్టార్స్ గా మారుతున్నారు.

స్పోర్ట్ అకాడమీలకు ఏటా చైనా కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. సైకాలజిస్ట్స్, ఫారిన్ కోచ్ లు, లేటెస్ట్ టెక్నాలజీ, సైంటిఫిక్ విధానాల్లో అత్యున్నత కోచింగ్ అందిస్తోంది. దేశీయ స్థాయిలో స్పోర్ట్ కు సంబంధించి చైనా.. అధికంగా పోటీలు నిర్వహిస్తోంది. చిన్నతనం నుంచే… కోచింగ్ క్యాంప్ కు వెళ్లే అవకాశం ఉండడం, సమగ్రశిక్షణ వెరసి, చైనీయులు క్రీడల్లో ఆధిపత్యం సాధించారు.

అదే మనదేశం విషయానికి వస్తే, ప్రైమరీ విద్యా సమయంలో …. మన చిన్నారులకు స్పోర్ట్స్ అంటే అవగాహన లేకుండా పోయింది.స్కూల్స్ లో గేమ్స్ అంటే ఏదో పరుగుపందెం, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తప్ప ఇంకో గేమ్ ఉందన్న సంగతే గుర్తు రాదు. మన చిన్నారులు గేమ్స్ లో చేరే సమయానికి వారి వయసు 11 ఏళ్ల పైమాటగా ఉంటోంది. ఓవేళ ఉన్నతస్థాయికి చేరుకున్నా అందువల్లే… ఎక్కువగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. అదే చైనాలో, ఐదు నుంచి 8 ఏళ్లలోపే గేమ్స్ లో చేరుతున్నారు. అందువల్లే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.

మనదేశంలో క్రీడా సంఘాలకు రాజకీయనాయకులు.. అధినేతలుగా ఉంటారు. క్రీడలు అనే అంశంపై చాలా రాష్ట్రాలకు అవగాహన లేదు. క్రీడా మంత్రిత్వశాఖ పేరుకు మాత్రమే ఉంది. కానీ దానికి నిధుల కేటాయింపు ఉండదు. సమగ్ర క్రీడా విధానం అమల్లో లేనప్పుడు… క్రీడల్లో పురోగతి ఎలా సాధ్యమని మాజీ ఒలింపియన్ కరణం మల్లీశ్వరి లాంటి వారు వాపోతున్నారు.

Related Articles